17 సార్లు ఆ హీరో చెంప చెళ్లుమనిపించాను: Saaho నటుడు

ఓ హీరోను పట్టుకుని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 సార్లు చెంప చెళ్లుమనిపించాడట బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్. ఆ హీరో ఎవరో కాదు అనిల్ కపూర్. వీరిద్దరూ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో మంచి స్నేహితులు. అలాంటిది కొట్టుకునేంత గొడవ ఏమొచ్చింది అనుకుంటున్నారా? అవి షూటింగ్‌లో భాగంగా తిన్న తన్నులు. అనిల్, జాకీ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. వీరిద్దరూ నటించిన ‘పరిందా’ అనే సినిమా విడుదలై నవంబర్ 3కి 30 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా అప్పటి రోజుల్ని గుర్తుచేసుకుంటూ ఓ వీడియోను విడుదల చేశారు జాకీ ష్రాఫ్.

‘ఓ సీన్‌లో నేను అనిల్ కపూర్‌ని కొట్టాల్సి ఉంది. ఎన్నిసార్లు చేసినా ఆ సీన్ పర్‌ఫెక్ట్‌గా వచ్చేది కాదు. దాంతో ఎక్కువ టేక్స్ తీసుకోవాల్సి వచ్చింది. అలా 17 సార్లు అనిల్‌ చెంప చెళ్లుమనిపించాను. చెప్పాలంటే ఫస్ట్ టేక్‌లోనే నేను అనిల్‌ను సరిగ్గా కొట్టాను. అనిల్ కూడా సరైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. డైరెక్టర్ షాట్ ఓకే చేశాడు. కానీ అనిల్ మాత్రం ఇంకో టేక్ ఇంకో టేక్ అంటూ నాచేత 17 సార్లు కొట్టించుకున్నాడు. ఇది గాల్లో కొట్టే సన్నివేశం కాదు. నేను అనిల్‌ను నిజంగానే కొట్టాలి. నాకేమో అన్నిసార్లు కొడుతుంటే బాధేసింది’ అంటూ అప్పటిరోజుల్ని గుర్తుచేసుకున్నాడు జాకీ.

అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ ఎన్నో సినిమాల్లో అన్నాతమ్ముళ్ల పాత్రల్లో నటించారు. అనిల్ కంటే జాకీ వయసులో చిన్నవాడు. కానీ చూడటానికి జాకీ పెద్దవాడిలా ఉండేవాడు. దాంతో ఎప్పుడూ అతనే అన్న పాత్రను పోషించేవాడు. ఇప్పటికీ అనిల్ కపూర్‌కు హీరోగా నటించే అవకాశాలు వస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే 60 ఏళ్ల వయసులోనూ అనిల్ 30 ఏళ్ల కుర్రాడిలా యవ్వనంగా మెరిసిపోతున్నారు. చివరిసారిగా అనిల్, జాకీ 2013లో వచ్చిన ‘షూటౌట్ ఎట్ వాడాలా’ సినిమాలో నటించారు. మళ్లీ వీరిద్దరూ ఎప్పుడు కలిసి నటిస్తారా అని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన సాహో సినిమాలో జాకీ ష్రాఫ్ ప్రభాస్ తండ్రిగా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.