హుజూర్‌నగర్ ప్రజలకు టీఆర్ఎస్ సర్కారు తొలి కానుక

ఉపఎన్నికలో తమకు ఘన విజయం కట్టబెట్టిన ప్రజలకు టీఆర్ఎస్ సర్కారు నజరానా ప్రకటించింది. సూర్యాపేట జిల్లాలో కొత్తగా హుజూర్ నగర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్‌నగర్‌లో ఘన విజయం సాధించిన అనంతరం సీఎం కేసీఆర్ నాయకత్వంలో.. టీఆర్ఎస్ ప్రజా కృతజ్ఞతా సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారు.

సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం సూర్యాపేట, కోదాడ రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కోదాడ రెవెన్యూ డివిజన్‌ నుంచి చింతలపాలెం, మేళ్లచెర్వు, మఠంపల్లి, హుజూర్‌నగర్‌ మండలాలను.. సూర్యాపేట రెవెన్యూ డివిజన్‌ నుంచి గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు మండలాలను విడదీసి కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయనున్నారు.

ఎంపీగా గెలుపొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్‌నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రికార్డు స్థాయిలో 42 వేలకుపైగా ఆధిక్యంతో గెలుపొందారు. తమ పార్టీని గెలిపిస్తే రూ.100 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల వేళ టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఆ దిశగా ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం సైదిరెడ్డి తెలిపారు. హుజూర్‌నగర్‌లో అభివృద్ధి పనులకు నవంబరు 1న మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేస్తారని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.

నియోజకవర్గాల పునర్విభజనలో హుజూర్‌నగర్‌‌ను నియోజకవర్గంగా మార్చిన నాటి నుంచే రెవెన్యూ డివిజన్‌ చేయాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఇక్కడి ప్రజలు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ఆందోళన చేశారు. కానీ కోదాడను రెవెన్యూ డివిజన్‌గా మార్చడంతో.. హుజూర్‌నగర్ ప్రాంత వాసులు ఆందోళనలను విరమించుకున్నారు.

కానీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన శానంపూడి సైదిరెడ్డి.. తాను గెలవగానే రెవెన్యూ డివిజన్‌ చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు గెలిచిన ఐదు రోజుల్లోనే డివిజన్‌ సాధించి చూపించారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.