శివసేన కీలక నిర్ణయం.. మరింత వేడెక్కిన ‘మహా’రాజకీయం!

ఫలితాలు వెల్లడై వారం రోజులు గడిచినా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. అధికారాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందేనని పట్టువీడటం లేదు. దీంతో మిత్రపక్షాలైన బీజేపీ-శివసేనల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాపై శివసేన పట్టువీడకపోవడంతో కమలనాథులు సైతం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమతో గతంలో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాలని శివసేన చేస్తున్న డిమాండ్‌పై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ స్పందించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు పొత్తుల సమయంలో శివసేనకు తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని, రెండోసారి తానే సీఎంగా ఉంటానని అన్నారు. అంతేకాదు, డిప్యూటీసీ సీఎం పదవి శివసేనకు ఇస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం ఆయన దాటవేశారు.

ఐదేళ్లూ సీఎం పదవిలో ఉండాలని శివసేన కోరుకోవచ్చని, అయితే కోరిక వేరు.. సాధించడం వేరని అన్నారు. వాళ్లు డిమాండ్లతో వస్తే వాటి యోగ్యతలను మేం పరిశీలిస్తామనిని అన్నారు. శివసేనతో ఒప్పందం చేసుకోలేదన్న ఫడ్నవీస్‌ ప్రకటనతో మరింత వేడి రాజుకుంది. ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ధీటుగా స్పందించిన శివసేన.. బీజేపీతో బుధవారం జరగబోయే కీలక సమావేశాన్ని రద్దు చేసింది.

అంతేకాదు, గతంలో తమతో ఒప్పందం చేసుకుందని తెలిపే ఓ వీడియోను శివసేన బయటపెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న మీడియా సమావేశంలో ఫడ్నవీస్‌ మాట్లాడుతూ.. తాము తిరిగి అధికారంలోకి వస్తే పదవులు, బాధ్యతలను సమానంగా పంచుకుంటామని అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా హర్యానాలో బీజేపీ-జేజేపీ సంకీర్ణ ప్రభుత్వంపై శివసేన పరోక్ష విమర్శలు గుప్పించింది. జైలుకెళ్లిన తండ్రి ఉన్న దుష్యంత్‌ చౌతాలా వంటివాళ్లు మహారాష్ట్రలో లేరని, అందుకే ప్రభుత్వ ఏర్పాటు ప్రకియ ఆలస్యం అవుతోందని చురకలంటించింది. హర్యానా, మహారాష్ట్రల్లో పరిస్థితులు వేరని, ఇక్కడ ధర్మం, సత్యంతో కూడుకున్న రాజకీయాలు నడిపే శివసేన ఉందని వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో కలిసి పోటీచేసినందున బీజేపీతో సంకీర్ణానికి తాము కట్టుబడి ఉన్నామని, ప్రభుత్వ ఏర్పాటుకు ప్రత్యామ్నాయాలను చూసుకునే పరిస్థితిని రానివ్వకండని హెచ్చరించింది.

తమను అధికారానికి దూరంగా ఉంచాలని కోరుకుంటే.. క్షణాల్లో నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది. గతంలో ఏం నిర్ణయించామో దాని ప్రకారమే వెళ్లాలన్నది మాత్రమే మా డిమాండ్‌ అని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ఉద్ఘాటించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ అక్టోబరు 31 లేదా నవంబరు 1న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని, శివసేన కూడా ప్రభుత్వంలో చేరుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. అయితే, ఫడ్నవీస్ ప్రకటనతో తీవ్రంగా మండిపడిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. బుధవారం సాయంత్రం 4 గంటలకు బీజేపీతో జరగాల్సిన సమావేశాన్ని రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు.

మరోవైపు, శివసేనకు చెందిన 45 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ ఎంపీ సంజయ్ కకాడే సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరంతా ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని వ్యాఖ్యానించారు. వీరిలో కొంత మంది మంత్రులు కూడా ఉన్నారని, తమ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేకు నచ్చజెబుతారని కకాడే పేర్కొన్నారు. కాగా, అధికారాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలన్న డిమాండ్‌కు బీజేపీ అంగీకరించదని.. ఆ విషయం శివసేనకు తెలుసని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఇలా అయితే ఎక్కువ మంత్రి పదవులైనా దక్కుతాయనే వ్యూహంతోనే ఇలా పట్టుబడుతోందని వ్యాఖ్యానిస్తున్నాయి.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.