శివసేనకు బీజేపీ కొత్త ఆఫర్.. వర్క్‌‌అవుట్ అవుతుందా?

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. శాసనసభాపక్ష నేతగా ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్‌ను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరోవైపు, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే మిత్రపక్షం మద్దతు తప్పనిసరి. అయితే, అధికారాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని శివసేన పట్టుబడుతోంది.ఈ నేపథ్యంలో బీజేపీ మధ్యే మార్గాన్ని అవలంభించనున్నట్టు తెలుస్తోంది. మిత్రపక్షానికి డిప్యూటీ సీఎం పదవి సహా, 13 మంత్రి పదవులను ఇవ్వాలని బీజేపీ నిర్ణయించినట్టు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుపై వీలైనంత త్వరగా శివసేనతో తమ పార్టీ అధినాయకత్వం సంప్రదింపులు జరుపుతుందని ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శివసేన ఎంపీ, సామ్నా పత్రిక ఎడిటర్ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఒకవేళ మహారాష్ట్రలో బీజేపీ-శివసేన ప్రభుత్వం ఏర్పడితే సంతోషమే అని అన్నారు.

కొత్త ప్రభుత్వానికి తానే నాయకత్వం వహిస్తానని, ఒకటి రెండు రోజుల్లో సీఎంగా ప్రమాణం చేస్తానని ఫడ్నవీస్ తెలిపారు. తమ కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించిందని, స్వతంత్రుల మద్దతు కూడా తమకే ఉందని అన్నారు. ప్రజలు తీర్పు తమకే అనుకూలంగా వచ్చి 161 స్థానాల్లో విజయం సాధించామని, దీనిని గౌరవిస్తామని పేర్కొన్నారు. సుస్థర ప్రభుత్వ ఏర్పాటులో తమకు ఎలాంటి ఆటంకాలు లేవని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. కీలకమైన అంశాలు త్వరలోనే పరిష్కారమవుతాయని, ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం ఉండబోదని వివరించారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో ఫడ్నవీస్ చర్చలు జరుపుతారని బీజేపీకి చెందిన ఓ నేత వ్యాఖ్యానించారు.

కాగా, శివసేన శాసనసభా పక్షం గురువారం సమావేశం కానుంది. మంత్రి పదవుల్లో 26 బీజేపీ ఉంచుకుని 13 శివసేనకు ఇవ్వాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రెవెన్యూ, ఆర్థిక, హోం, పట్టణాభివృద్ధి లాంటి కీలక శాఖలను బీజేపీ తనవద్దే అట్టుపెట్టుకుంటుందని తెలిపాయి. బీజేపీ ప్రతిపాదనలపై ఆచితూచి స్పందించాలని శివసేన భావిస్తోంది. తమకు ఎన్ని క్యాబినెట్, సహాయ మంత్రి పదవులు దక్కుతాయని.. దాని ప్రకారమే ముందుకు వెళ్లాలని భావిస్తోంది. గత ప్రభుత్వంలో ఐదు క్యాబినెట్, ఏడు సహాయక మంత్రి పదవులను శివసేనకు ఇచ్చామని, ఈసారి వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉందని బీజేపీకి చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.