వినాయకుడి విగ్రహం ధ్వంసం చేసి వైఎస్ విగ్రహం!

ఏపీలో టీడీపీ-వైఎస్సార్‌సీపీ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. అధికార పార్టీపై రోజుకో పోస్టుతో సోషల్ మీడియా టీడీపీ దూకుడుగా ముందుకెళుతోంది. అనంతపురం జిల్లాలో గ్రామ సచివాలయంపై ఉన్న జాతీయ జెండా రంగుల్ని మార్చి.. వైఎస్సార్‌సీపీ రంగులు వేయడంపై విమర్శలు చేసింది. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆ వీడియోను వైరల్ చేసింది. ఈ వివాదం సమసిపోకముందే.. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఓ ఘటనను తెరపైకి తెచ్చింది.

పట్టిన్న పాలెం అనే గ్రామంలో వినాయకుడి విగ్రహాన్ని తొలగించి.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం పెట్టేందుకు ప్రయత్నించారని.. స్థానికులు అడ్డుకోవడంతో ఆ ప్రయత్నం ఆగిపోయిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఓ న్యూస్ ఛానల్‌లో వచ్చిన కథనాన్ని ట్వీట్ చేశారు. అందులో ‘నిన్న జాతీయ జెండా రంగులకు వైసీపీ రంగులు పూసి తమకు దేశం కన్నా మా పార్టీనే ముఖ్యమని చాటుకున్నారు వైసీపీ నేతలు. ఇక ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పట్టిన్నపాలెంలో ఏకంగా వినాయక విగ్రహాన్నే తొలగించి వైస్సార్ విగ్రహాన్ని పెట్టేందుకు ప్రయత్నించారు వైసీపీ నేతలు’అని ఆరోపించారు.

సోషల్ మీడియాలో టీడీపీతో పాటూ తెలుగు తమ్ముళ్లు ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. మొన్న అనంతపురంలో గ్రామ సచివాలయంపై ఉన్న జాతీయ జెండా రంగులు మార్చేశారని.. ఇప్పుడు ఏకంగా దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నారు. మరి దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.