వంశీతో కేశినేని, కొనకళ్ల భేటీ.. మూడున్నర గంటలుపైగా చర్చలు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం ఎమ్మెల్యే వంశీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఎమ్మెల్యే పదవితోపాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు చంద్రబాబుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన చంద్రబాబు.. వంశీని బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ బాధ్యతలను విజయవాడ ఎంపీ , మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలకు అప్పగించారు. సోమవారం నుంచి వంశీని కలిసేందుకు వీరు ప్రయత్నించగా, ఎట్టకేలకు బుధవారం రాత్రి భేటీ అయ్యారు. కేశినేని నివాసంలో దాదాపు మూడున్నర గంటలపాటు బుధవారం అర్ధరాత్రి వరకు ఈ చర్చలు జరిగాయి.

వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, అధికారులు కలిసి అక్రమ కేసుల బనాయించి తనను, తన అనుచరులను ఇబ్బందులకు గురిచేస్తున్న విషయాన్ని వంశీ ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. అంతేకాదు, టీడీపీలోనూ తనకు ఎదురవుతోన్న ఇబ్బందులను సైతం వారి దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నానని.. ఇక వెనకడుగు వేయలేనని వంశీ వీరికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కేసులపై పోరాడేందుకు చంద్రబాబు సహా పార్టీ మొత్తం అండగా ఉంటుందని కేశినేని, కొనకళ్ల నారాయణ ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

టీడీపీలో ఉంటేనే మంచి భవిష్యత్‌ ఉంటుందని తెలిపిన నాని, కొనకళ్ల.. పార్టీలోని అంతర్గత సమస్యల పరిష్కారానికి చంద్రబాబు తరఫున హామీ ఇచ్చారు. దీంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నానని వారితో వంశీ చెప్పినట్లు సమాచారం. అనంతరం చంద్రబాబు నివాసానికి చేరుకున్న నేతలు.. వంశీతో జరిగిన చర్చల సారాంశాన్ని ఆయనకు వివరించారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.