రెండో టీ20లోనూ లంక చిత్తు.. ఆసీస్‌దే సిరీస్

గడ్డపై టీ20 సిరీస్‌లో శ్రీలంక తేలిపోతోంది. గత ఆదివారం అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కంగారూల చేతిలో ఏకంగా 134 పరుగుల తేడాతో ఓడిన లంకేయులు.. బ్రిస్బేన్‌ వేదికగా బుధవారం జరిగిన రెండో టీ20లోనూ నిరాశపరిచారు. దీంతో.. మూడు టీ20ల సిరీస్‌ని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో ఆస్ట్రేలియా కైవసం చేసుకోగా.. ఆఖరి టీ20 మ్యాచ్ మెల్‌బోర్న్‌లో శుక్రవారం జరగనుంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో ఉన్న పాకిస్థాన్‌ జట్టుని దాని సొంతగడ్డపైనే ఇటీవల 3-0 తేడాతో టీ20ల్లో శ్రీలంక క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే.

Read More:

బుధవారం రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు పేలవంగా 19 ఓవర్లలోనే 117 పరుగులకి ఆలౌటైంది. ఆ జట్టులో కుశాల్ పెరీరా (27: 19 బంతుల్లో 2×4, 1×6) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ గుణతిలక (21), ఫెర్నాండో (17) చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టాన్‌లేక్, పాట్ కమిన్స్, అస్టన్ అస్గర్, ఆడమ్ జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కుశాల్ మెండిస్, సందకన్ రనౌటయ్యారు. కెప్టెన్ లసిత్ మలింగ, హసనరంగ స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరగడం కొసమెరుపు.

118 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 13 ఓవర్లలోనే ఛేదించేసింది. ఓపెనర్/ కెప్టెన్ అరోన్ ఫించ్ గోల్డెన్ డక్‌గా ఔటైనా.. ఆ తర్వాత వచ్చిన స్టీవ్‌స్మిత్ (53 నాటౌట్: 36 బంతుల్లో 6×4)తో కలిసి ఓపెనర్ డేవిడ్ వార్నర్ (60 నాటౌట్: 41 బంతుల్లో 9×4) గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు. రెండో వికెట్‌కి అజేయంగా 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ.. లంక బౌలర్లకి మ్యాచ్‌లో ఏమాత్రం పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధానికి గురైన వార్నర్, స్మిత్.. పునరాగమనంలో తొలిసారి టీ20ల్లో ఆడుతున్నారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.