రామ్ ‘రెడ్’ మూవీ ఓపెనింగ్.. పూరి, ఛార్మి హంగామా

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రెడ్’. తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. పీటర్ హెయిన్స్ యాక్షన్ సీన్స్ డైరెక్ట్ చేయనున్నారు. దీపావళి సందర్భంగా సోమవారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. నిన్న టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లను విడుదల చేశారు. ఈరోజు (అక్టోబర్ 30న) సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.

Also Read:

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన రామ్.. తనతో ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వంటి క్లాసికల్ మూవీస్ తీసిన తిరుమల కిషోర్‌ను నమ్ముకున్నారు. అయితే, పోస్టర్లు చూస్తుంటే ఇది మంచి మాస్ మూవీలా అనిపిస్తోంది. అందుకే, ఈ సినిమా ఓపెనింగ్‌కు మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు అతిథిగా తీసుకొచ్చారు రామ్. ముహూర్తపు సన్నివేశానికి ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ తొలి క్లాప్ కొట్టారు. ఈ సమయంలో ఛార్మి అరుపులు, కేకలతో హంగామా చేశారు. ఆ తరవాత పూరి, ఛార్మిలను రామ్ ఆప్యాయంగా హత్తుకున్నారు.

ఇదిలా ఉంటే, ‘రెడ్’ సినిమా నవంబర్ 16 నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. నాన్ స్టాప్‌గా షూటింగ్ జరిపి ఏప్రిల్ తొలివారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని నిర్మాత ‘స్రవంతి’ రవికిషోర్ చెప్పారు. తమ బ్యానర్‌లో ఇదొక విభిన్నమైన చిత్రం అవుతుందని తెలిపారు. ఇది తమిళ చిత్రం ‘తదమ్’కు రీమేక్ అనే వార్తలు వస్తున్నాయి. దీనిపై రవికిషోర్ స్పందిస్తూ.. పూర్తి రీమేక్ కాదని, స్టోరీ లైన్‌ను తీసుకొని చాలా మార్పులు చేశామని అన్నారు. సినిమా టైటిల్ మాదిరిగానే కథ, కథనం కూడా చాలా కొత్తగా ఉంటాయని దర్శకుడు తిరుమల కిషోర్ వెల్లడించారు. ఇదొక కమర్షియల్ థ్రిల్లర్ అని చెప్పారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.