‘బిల్డ్ ఏపీ’ మరో కొత్త మిషన్‌కు జగన్ శ్రీకారం.. ప్రత్యేకత ఇదే

ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ‘బిల్డ్ ఏపీ’ పేరుతో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కొత్త మిషన్‌ను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు ఎన్‌బీసీసీ సంస్థతో కలిసి ‘బిల్డ్‌ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మిషన్‌లో భాగంగా ప్రభుత్వ భూములను గుర్తించి, భవన సముదాయాలు నిర్మించే తలంపులో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మిగతా భూముల్లో మౌలిక వసతులను కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, వీటిని మార్కెట్‌ ధరకు ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలకు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ భూములు, ఆక్రమణలు, వివాదాల్లో ఉన్న భూముల వివరాలను సేకరించనున్నారు.ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ భూముల వివరాలు అందజేయాలని జాయింట్‌ కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ‘బిల్డ్‌ ఏపీ మిషన్‌ డైరక్టర్‌గా ప్రవీణ్‌కుమార్‌ను నియమించింది. ఈ అంశంపై బుధవారం జరగనున్న కేబినెట్‌ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

ప్రధానంగా వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న ప్రతిష్టాత్మకమైన ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం మార్గదర్శకాలను ఈ సమావేశంలో మంత్రివర్గం ఖరారు చేయనుంది. అలాగే మహిళలు, పిల్లలు తీవ్ర రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 77 గిరిజన మండలాల్లోని 1,642 గ్రామ పంచాయతీల్లో అదనపు పౌష్టికాహారం అందించేందుకు చేపట్టనున్న పైలెట్‌ ప్రాజెక్టుకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.

ఇప్పటికే విశాఖపట్నంలో ఐఐఎం క్యాంపస్‌ నిర్మాణ పనులను నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ దక్కించుకొంది. ప్రాజెక్టు తొలి దశలో భాగంగా ఇక్కడ తరగతి గదులు, నివాస సముదాయం, పరిపాలన భవనం, గ్రంథాలయం, ప్రయోగశాలలు, క్రీడలు, ఇతర ఉమ్మడి సౌకర్యాలను ఎన్‌బీసీసీ నిర్మిస్తుంది. తాజాగా బిల్డ్ ఏపీలోనూ ప్రభుత్వంతో భాగస్వామి కానుంది.

కాగా, రాష్ట్రంలో ప్రతి పేదవాడికి బ్యాంక్‌ రుణం లేకుండా ఉచితంగా ఇల్లు కట్టిఇస్తామని గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. డిసెంబరు నాటికి 9 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేస్తామని.. ఉగాదికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.