‘బాబుది క్రిమినల్ మైండ్.. అందుకే పవన్ కళ్యాణ్‌తో..’

టీడీపీ అధినేత చంద్రబాబుది క్రిమినల్ మైండ్ అని వైఎస్సార్సీపీ ఎంపీ ఘాటు విమర్శలు చేశారు. ఇసుక కొరతపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకసారి ఇసుక దొరక్క కూలీలు పస్తులు ఉంటున్నారని అంటారని.. మరోసారి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని నిందలు వేస్తాడని విమర్శించారు. ఇసుక పొరుగు రాష్ట్రాలకు తరలిపోతోందంటూ గగ్గోలు పెడుతుంటాడన్నారు. అసలేం మాట్లాడతాడో తనకే అర్థం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇసుక కొరత అని చంద్రబాబు రాద్ధాంతం వెనుక ఉద్దేశాలు వేరే ఉన్నాయని విజయసాయి పేర్కొన్నారు. తను సృష్టించిన ఇసుక మాఫియా ఆదాయం కోల్పోయి బిక్క చూపులు చూస్తోందనేదే చంద్రబాబు అసలు బాధ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినా బాబుకు బుద్ధి రాలేదని తీవ్ర విమర్శలు చేశారు. చింతచచ్చినా పులుపు చావలేదంటూ సెటైర్లు వేశారు.

ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా చంద్రబాబు క్రిమినల్ మైండ్ ఇంకా షార్ప్‌గానే పని చేస్తోందంటూ విజయసామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే ఇసుక కొరతపై ఇతర పార్టీల సేవలను కూడా వినియోగించుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. నిరసన ప్రదర్శనలను కూడా ఔట్ సోర్సింగ్ ద్వారా మరో పార్టీతో చేయించే స్కెచ్ వేశాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Also Read:

లాంగ్ మార్చో, షార్ట్ మార్చో. స్పాన్సర్ చేసేది ఆయనే అని అందరికీ తెలిసిపోయిందంటూ జనసేనాని పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు. ఇసుక కొరతపై వచ్చే నెల 3న విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. జనసేన ర్యాలీని ఉద్దేశించి విజయసాయి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. చంద్రబాబు కోసమే పవన్ ర్యాలీ చేస్తున్నారని.. అందుకు ఖర్చులు కూడా చంద్రబాబే పెడుతున్నారని విజయసాయి ఆరోపణలు గుప్పించారు.

భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3న జనసేన పార్టీ విశాఖపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఇసుక కొరత కారణంగా ఉపాధి లభించకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. వారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారని జనసేన పార్టీ తెలిపింది. మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కళ్యాణ్ ర్యాలీని ప్రారంభిస్తారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.