పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది.. నన్ను సంప్రదించండి అంటున్న స్టార్ హీరో

బాలీవుడ్ సూపర్‌స్టార్ అభిమానుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించాడు. పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. నవంబర్‌లో బోలెడు ముహూర్తాలు ఉన్నాయని అంటున్నారు. మరి పెళ్లంటే సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇలాంటి అవసరాలు ఏమైనా ఉంటే నన్ను సంప్రదించండి అని అంటున్నాడు రణ్‌వీర్. ‘83’ సినిమా కోసం మీసం పెంచిన రణ్‌వీర్ షూటింగ్ అయిపోవడంతో గెడ్డం, మీసం తొలగించాడు. ఈ నేపథ్యంలో ఓ చక్కటి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కేవలం ఫొటో పోస్ట్ చేసి ఊరుకుంటే అతను రణ్‌వీర్ ఎందుకు అవుతాడు చెప్పండి. అందుకే ఓ ఫన్నీ క్యాప్షన్‌ను కూడా పెట్టాడు.

‘పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఎంటర్‌టైనర్ ఫర్ హైర్. ఈవెంట్స్, వెడ్డింగ్స్, బర్త్‌డే పార్టీలు ఏమైనా ఉంటే నన్ను సంప్రదించండి’ అని పేర్కొన్నాడు. ఇందుకు వెంటనే రణ్‌వీర్ భార్య దీపిక పదుకోన్ ఇచ్చిన కామెంట్ అంతకంటే హైలైట్‌గా నిలిచింది. ‘బుకింగ్స్ కోసం నన్ను సంప్రదించండి’ అని పేర్కొన్నారు. రణ్‌వీర్ క్యాప్షన్‌పై ఎందరో సినీ ప్రముఖులు స్పందించారు. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ స్పందిస్తూ.. ‘నువ్వు చాలా చీప్’ అన్నాడు. అనుపమ్ ఖేర్ స్పందిస్తూ.. ‘ఫొటోలో నువ్వు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చూసి కూడా నిన్ను సంప్రదించాడంటే వాడికి ఎంతో గట్స్ ఉండి ఉండాలి’ అన్నారు. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ స్పందిస్తూ.. ‘మాకు పెళ్లికొడుకు కావాలి’ అని సరదాగా కామెంట్ చేశారు.

ఇక వర్క్ విషయానికొస్తే.. లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు 1983లో ఇండియా వరల్డ్ కప్ ఎలా సాధించింది అన్న నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు ‘83’ అనే టైటిల్‌ను పెట్టారు. ఇందులో రణ్‌వీర్ కపిల్ దేవ్ పాత్రలో నటించారు. కపిల్ భార్య రోమీ దేవ్ పాత్రలో రణ్‌వీర్ భార్య దీపిక పదుకోన్ నటించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఐదో సినిమా ఇది. ఇటీవల దీపిక, రణ్‌వీర్ పెళ్లయ్యాక తొలిసారి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ప్రస్తుతం వీరు బోలెడు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.