నా వంపులు దాచుకోలేదు, చూస్తే చూడండి లేకపోతే లేదు: సోనాక్షి సిన్హా

హీరోయిన్ అంటే సన్నగానే ఉండాలా? కాస్త లావుంటే అస్సలు చూడరా? లావుగా ఉన్నా అందం, నైపుణ్యం ఉండాలే కానీ ఎందుకు చూడరు. ఈ మూడు కలగలిపిన నటీమణులు మన తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువే. కానీ బాలీవుడ్‌లో సోనాక్షి సిన్హా, జరీన్ ఖాన్ లాంటి ఎందరో హీరోయిన్లు ఉన్నారు. వారంతా తమ బరువునే అందంగా మార్చుకుంటున్నారు. అలనాటి నటుడు శత్రుఘ్న సిన్హా కూతురు అయిన 2010లో వచ్చిన ‘దబాంగ్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె కాస్త లావు ఉన్నప్పటికీ ప్రేక్షకుల మన్ననలు పొందారు.

ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్నారు. బాలీవుడ్‌లో అవకాశాలు వస్తున్న కొద్దీ సోనాక్షికి ఫ్యాన్స్‌తో పాటు ట్రోల్స్ చేసేవారు కూడా పెరిగిపోయారు. ఇందుకు కారణం ఆమె కాస్త లావుగా ఉండటమే. ఓసారి సోనాక్షి అందంగా తయారై చక్కటి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోపై కొందరు సానుకూలంగా స్పందిస్తే.. మరికొందరు మాత్రం ‘ఏనుగుకి మేకప్ వేసినట్లుంది’ అని కామెంట్ చేశారు. దాంతో చాలా రోజుల పాటు సోనాక్షి ఎంతో బాధపడ్డారు. ఆ తర్వాత అనేవారు అంటూనే ఉంటారని పట్టించుకోవడం మానేశారు. అయితే సోనాక్షి ఈ మధ్యకాలంలో కాస్త బరువు కూడా తగ్గారు. అయినప్పటికీ తనపై కామెంట్లు చేయడం మానలేదట. అలాంటివారందరికీ బుద్ధి చెప్పడానికి సోనాక్షి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.

‘ఇప్పుడు మనం ఏనుగు గురించి మాట్లాడుకుందాం. మీరంతా నన్ను అలాగే ఎగతాళి చేసేవారు కదా. కొన్నేళ్ల పాటు మీరు నా బరువుపై కామెంట్లు చేశారు. కానీ ఎప్పుడూ రియాక్ట్ అవ్వకూడదని అనుకున్నాను. ఎందుకంటే ఏనుగు అన్ని జంతువుల్లో పెద్దది. ట్రోల్స్ చేసేవారంతా మన మూడ్‌ని కూడా నరకం చేసేస్తారు. వారందరికీ వేరే పని లేక ఇతరులను ఎగతాళి చేస్తుంటారు. కాబట్టి వారు నోటికొచ్చినట్లు వాగుతుంటారు. ఇదివరకు వారి కామెంట్స్‌కు మనకు కోపం వచ్చేది. బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు వారు ఓ జోక్ అయిపోయారు. విని నవ్వుకోవడం తప్ప ఇంకేం చేయలేం. ఆ తర్వాత నేను 30 కిలోలు బరువు తగ్గాను. అయినా కూడా నాపై కామెంట్లు చేయడం మానలేదు. వారి చావు వారే చస్తారు అని వదిలేశాను. నేను ఇండస్ట్రీలో నాకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి వచ్చాను. తెచ్చుకున్నాను కూడా. నా శరీరం గురించి నేను దాచుకోవాల్సింది ఏమీ లేదు. నా నడుం సైజ్, వంపులు, నా బరువు ఇవేవీ నేను దాచుకోలేదు. ఎందుకంటే కొలవడానికి నేను స్కేల్‌ని కాను. ఆడపిల్లని’ అని వెల్లడించారు సోనాక్షి.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.