జగన్ సర్కార్‌పై టీడీపీ ఎంపీ ప్రశంసలు

జగన్ సర్కార్‌పై టీడీపీ ఎంపీ ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ నిర్ణయం భేష్ అంటూ కితాబిచ్చారు. ప్రభుత్వ నిర్ణయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఎంపీ శుభపరిణామమంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించడంపై అదే కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మంత్రి ఆనందం వ్యక్తం చేస్తూ ఆ ఎంపీకి అభినందనలు తెలపడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ విషయమేంటంటే..

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల ఆస్పత్రిలో రోగుల సహాయకుల కోసం విజయవాడ ఎంపీ కల్పించిన వసతి సౌకర్యాలను రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. ప్రారంభోత్సవ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మంచి పరిణామమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష ఎంపీ ప్రశంసించడంపై మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు. రోగుల సహాయకుల కోసం వసతి ఏర్పాటు చేసినందుకు కేశినేని నానికి మంత్రి అభినందనలు తెలిపారు.

Also Read:

రాజకీయ , సామాజిక విషయాలపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారని ఎంపీ కేశినేని నానికి పేరుంది. ఆ మనస్తత్వమే ఆయనకు గతంలో చిక్కులు కూడా తెచ్చిపెట్టింది. సొంత పార్టీ నేతలే టార్గెట్ చేయడంతో వ్యక్తిగత విమర్శల వరకూ వెళ్లింది. పార్టీలో ఉండాలో వద్దో తేల్చుకోవాలని, లేకుంటే పెంపుడు కుక్కలను అదుపులో పెట్టుకోవాలంటూ ఏకంగా చంద్రబాబుకే చెప్పేశారు నాని.

అయితే పార్టీ అధినేత సైతం సంయమనం వహిస్తున్న అంశంపై ఎంపీ ప్రశంసలు కురిపించడం కొత్త చర్చకు దారితీస్తోంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న చంద్రబాబు ఆర్టీసీ విలీనంపై మాత్రం మౌనంగానే ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ కేశినేని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా కోణంలోనూ ఎంపీ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.