జగన్ సన్నిహితుడిని రాజ్యసభకు పంపనున్న కేసీఆర్!

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవలే చండీ యాగం చేసిన సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లాలోని తన సొంతూర్లో ఉన్న మామిడి తోటలో.. మాజీ ఎంపీ యాగం నిర్వహించారు. ఈ యాగానికి తెలంగాణతోపాటు ఏపీకి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సహస్ర చండీ యాగం ఫలితమో లేదంటే గులాబీ అధినేత కేసీఆర్ కటాక్షమో తెలీదు కానీ.. ఆయన్ను రాజ్యసభకు పంపుతారనే ప్రచారం మొదలైంది.

2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. అనంతరం టీఆర్ఎస్‌లో చేరారు. 2019 ఎన్నికల్లో ఆయన్ను పక్కనబెట్టిన కేసీఆర్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వర రావుకు ఎంపీ టికెట్ ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు వ్యతిరేకంగా పొంగులేటి వ్యవహరించారనే ఆరోపణల కారణంగానే ఆయనకు ఎంపీ టికెట్ దక్కలేదు.

లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రమించారు. దీంతో నామా విజయం తేలికైంది. దీంతో పొంగులేటికి న్యాయం చేయాలని కేసీఆర్ భావించినట్టు తెలుస్తోంది. అందుకే ఆయన్ను త్వరలోనే రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరుగుతోంది.

టీఆర్ఎస్‌లో పొంగులేటి తిరిగి చురుగ్గా వ్యవహరిస్తున్నారు. యాగం తర్వాత.. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వెలిసిన పోస్టర్లు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. శీనన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన వర్గీయులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు కట్టారు.

పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏపీ సీఎం జగన్‌తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో పొంగులేటి కుమారుడి నిశ్చితార్థం జరగ్గా.. ఆ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు. అటు ఏపీ సీఎంతో ఉన్న సన్నిహిత సంబంధాలు.. జిల్లాలో తనకంటూ వర్గం ఉండటం.. జిల్లాలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు.. ఇవన్నీ పొంగులేటికి అనుకూలంగా మారాయంటున్నారు.

Read Also:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.