కొనసాగుతోన్న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలకు ఛాన్స్!

అరేబియా మహా సముద్రంలో కోమరీన్ ప్రాంతంలో వల్ల తీవ్ర ఏర్పడింది. దీనికి అనుబంధంగా బుధవారం లక్షదీవుల ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలోనూ అల్పపీడనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బుధవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశలున్నాయని అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడతాయని వెల్లడించారు. ఏపీలో తీరం వెంబడి ఉండే గ్రామాల, పట్టణాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని పేర్కొన్నారు.

అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, దక్షిణ కర్ణాటక, కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో కొన్నిచోట్ల భారీవర్షాలు కురిశాయి. కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. కేరళ, మాల్దీవులు, మన్నూ ప్రాంతాల్లోని అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణకేంద్రం వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాలకు తోడు అల్పపీడనం ఏర్పడటంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఇక ఏపీలోని పలు జిల్లాల్లో రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిశాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. గుంటూరు జిల్లాలోని బాపట్ల, పరిసర ప్రాంతాలు, ప్రకాశం జిల్లా ఒంగోలు, చీరాల, వేటపాలెం, చినగంజాం, పరుచూరు, మార్టూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. చీరాలలో ఉరుములతో కూడిన జల్లులు పడ్డాయి. కడప, అనంతపురం జిల్లాల్లోనూ కుండపోత వర్షం కురిసింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి కడపలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.