కశ్మీర్ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన జమ్మూ కశ్మీర్, లడఖ్

సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి రోజున జమ్మూ కశ్మీర్, కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 560 సంస్థానాలు భారత్‌లో విలీనమయ్యేందుకు పటేల్ కృషి చేశారు. నాటి హోం మంత్రి హోదాలో పటేల్ చేసిన సేవలకు గుర్తుగా.. ఆయన జయంతి రోజైన అక్టోబర్ 31ని విభజనకు అపాయింటెడ్ డే గా ప్రకటించింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని ఆగష్టు 5న రద్దు చేసిన కేంద్రం.. ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించి.. కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌కు అసెంబ్లీ ఉంటుంది, లడఖ్‌లో మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్ పాలన సాగిస్తారు.

నేటి నుంచి జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిపోయాయి. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసి.. కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం ద్వారా ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక జెండా, రాజ్యాంగం, చిహ్నాలు ఇక నుంచి కనిపించవు. కశ్మీర్‌లకు ఇప్పటి వరకూ లభిస్తున్న ప్రత్యేక హక్కులేవీ ఉండవు. భారతీయులు ఎవరైనా అక్కడ స్థిర నివాసం ఏర్పర్చుకోవచ్చు. కశ్మీర్లో పరిశ్రమల ఏర్పాటుకు, ఉపాధి అవకాశాలు పెరగడానికి మార్గం సుగమం కానుంది.

జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా జీసీ ముర్ము, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఆర్కే మాథుర్‌‌లు నేడు బాధ్యతలు స్వీకరిస్తారు. శ్రీనగర్‌లో ముర్ము ప్రమాణం చేయనుండగా… మాథూర్ ఇప్పటికే లేహ్‌లో బాధ్యతలు చేపట్టారు.

అక్టోబర్ 26, 1947న జమ్మూ కశ్మీర్‌ను మహారాజా హరి సింగ్ భారత్ యూనియన్‌లో విలీనం చేయడానికి అంగీకరించారు. కశ్మీర్‌ భారత్‌లో విలీనమైన 72 ఏళ్ల తర్వాత ఆ రాష్ట్రాన్ని విభజించడం గమనార్హం. గతంలో కేంద్ర పాలిత ప్రాంతాలను రాష్ట్రాలుగా మార్చారు. కానీ ఓ రాష్ట్రాన్ని రెండుగా విభజించి, కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారడంతో.. దేశంలో రాష్ట్రాల సంఖ్య 28కి తగ్గగా.. కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 9కి పెరిగింది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.