కశ్మీర్‌లో పేట్రేగిపోయిన ఉగ్రవాదులు.. ఐదుగురు బెంగాలీలు మృతి

రద్దు తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాదులు తొలిసారిగా పేట్రేగిపోయారు. స్థానికేతరులే లక్ష్యంగా మంగళవారం కాల్పులకు పాల్పడ్డారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో వలసకూలీలపై ఉగ్రవాదులు దాడిచేశారు. ఈ ఘటనలో బెంగాల్‌కు చెందిన అయిదుగురు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రదాడిలో చనిపోయినవారికి పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌‌కు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. కశ్మీరుకు వలసవచ్చిన వీరంతా తాపీ పనిచేసుకుంటూ జీవనం గడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. యూరోపియన్ యూనియన్ ఎంపీల బృందం కశ్మీర్‌‌లో పర్యటించిన రోజే ఈ దుశ్చర్యకు ఉగ్రవాదులు పాల్పడటం గమనార్హం. ఈ ఘటనతో అప్రమత్తమైన సైన్యం కుల్గాం ప్రాంతంలో గాలింపు చర్యలను చేపట్టినట్లు జమ్మూ-కశ్మీర్‌ డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ తెలిపారు. అదనపు బలగాలను రప్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

మరోవైపు ఫుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పదోతరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాల సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీరేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా ట్రక్క్ డ్రైవర్లు, వలస కూలీలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. సోమవారం అనంత్‌నాగ్ సమీపంలో ఉద్ధమ్‌పూర్‌కు చెందిన ఓ డ్రైవర్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆగస్టు 5 తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాదుల చేతిలో ఇప్పటి వరకు నలుగురు డ్రైవర్లు హత్యకు గురయ్యారు. యాపిల్ సీజన్ కావడంతో బయట రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు, ట్రక్కు డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు.

జమ్మూ-కశ్మీర్‌లోని భద్రతాదళాలు, ప్రభుత్వ ఆఫీసులనే ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. జైషఏ మహ్మద్‌, లష్కరే తొయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ లాంటి ఉగ్రమూకలు దాడులకు తెగబడే ప్రమాదం ఉందని తెలిపాయి. అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించేందుకు ఈ తరహా చర్యలకు ఉగ్రవాదులు పాల్పడవచ్చని పేర్కొన్నాయి. ముఖ్యంగా శ్రీనగర్‌ జిల్లాలోని జోనాకర్‌, రైనావారి, సఫకదల్‌ ప్రాంతాల్లో ఉన్న భద్రతా సిబ్బందే లక్ష్యంగా గ్రెనేడ్‌ దాడులు జరగవచ్చని, అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అలాగే అవంతిపొర, రంగ్రేత్‌ వైమానిక స్థావరాల్లో ఏదో ఒకదానిపై ఉగ్రవాదులు మెరుదాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.