కమ్యూనిస్ట్ నేత, మాజీ ఎంపీ గురుదాస్ దాస్‌గుప్తా కన్నుమూత

కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ (83) కోల్‌కతాలో గురువారం ఉదయం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతోన్న ఆయన.. తన నివాసంలోనే ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగిన ఆయన డిప్యూటీ జనరల్ సెక్రటరీగానూ పనిచేశారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా 2001లో ఎన్నికై కార్మికుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేశారు. 2004లో సీపీఐ జాతీయ సెక్రటేరియెట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎంపీగానూ పలు ప్రజా సమస్యలపై పార్లమెంటులో తన వాణిని బలంగా వినిపించారు.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని బరిసాల్‌లో 1936 నవంబర్ 3న గురుదాస్ దాస్ గుప్తా జన్మించారు. కలకత్తా యూనివర్శటీలో ఎంకామ్ చదివి క్రమంగా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలపట్ట ఆకర్షితులయ్యారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా గురుదాస్ గుప్తా చాలా సాధారణ జీవితం గడిపారు. పార్లమెంటులో ఆయనే స్వయంగా పాల పాకెట్ కొనుక్కుని తానుండే వీపీ హౌస్‌కు నడచుకుంటూ వెళ్లేవారు. తొలిసారిగా 1985లో రాజ్యసభకు ఎన్నికై పార్లమెంటులో అడుగుపెట్టారు. తర్వాత పశ్చిమబెంగాల్‌లోని పన్‌స్కూరా పార్లమెంటు నియోజకవర్గం నుంచి 2004లో లోక్ సభ‌కు ఎన్నికయ్యారు. రెండోసారి 2009లో ఘటల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు.

యూపీఏ హయాంలో సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా గురుదాస్ గుప్తా ఉన్నారు. ఈ కుంభకోణం గురించి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తెలుసని చెప్పడమేకాదు, దానికి సంబంధించిన క్యాబినెట్ సెక్రెటరీ నోట్‌ను నిస్సంకోచంగా వెల్లడించారు. స్పెక్ట్రమ్ ధర పెంచాలని క్యాబినెట్ సెక్రెటరీ ప్రధానికి లేఖ రాసినపుడు కుంభకోణం గురించి డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలియదని బుకాయించడం సరికాదంటూ ప్రకటించి సంచలనం సృష్టించారు. గురుదాస్ గుప్తాకు భార్య, కుమార్తె ఉన్నారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.