అలనాటి మేటి నటి గీతాంజలి గుండెపోటుతో కన్నుమూత

సీనియర్‌ నటి గీతాంజలి గురువారం కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించిన గీతాంజలి.. ఎన్టీఆర్‌ దర్శకత్వంలో ఆయనే కథానాయుడిగా నటించిన సీతారాముల కళ్యాణం ద్వారా వెండితెరకు పరిచమయ్యారు. అన్ని భాషల్లోనూ 500కు పైగా చిత్రాల్లో నటించారు. కలవారి కోడలు, డాక్టర్‌ చక్రవర్తి, లేతమనసులు, బొబ్బిలియుద్ధం, ఇల్లాలు, దేవత, గూఢచారి116, కాలం మారింది, శ్రీ శ్రీ మర్యాదరామన్న, నిర్దోషి, మాయాజాలం, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. తొలి చిత్రం సీతారాముల కళ్యాణంలో గీతాంజలి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆమె ఎన్టీఆర్‌కు పోటీగా నటించి మెప్పించారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శ్రీరామమూర్తి, శ్వామసుందరి దంపతులకు జన్మిం. కాకినాడలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంటులో కొన్నేళ్లు చదివిన గీతాంజలి. మూడేళ్ల వయసు నుంచే గీతాంజలి తన అక్క స్వర్ణతో పాటు గంధర్వ నాట్యమండలిలో లక్ష్మారెడ్డి, శ్రీనివాసన్ ల వద్ద నాట్యం నేర్చుకున్నారు. నాలుగో ఏట నుంచి అక్కతో కలిసి నాట్య ప్రదర్శనలు ప్రారంభించారు. గీతాంజలి అసలు పేరు మణి. 1963లో పారస్‌మణి అనే హిందీ చిత్రంలో నటిస్తుండగా ఆ చిత్ర నిర్మాతలు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సినిమా టైటిల్లోనూ మణి ఉంది కాబట్టి ఈమెకు గీతాంజలి అని పేరు సూచించారు.

ఆ పేరు సినీరంగంలో అలానే స్థిరపడిపోయింది. సహనటుడు రామకృష్ణతో వివాహం తర్వాత సినిమాలకు కొంత విరామం ఇచ్చారు. క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిన ఆమె పెళ్లైన కొత్తలో,మాయాజాలం, భాయ్‌, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. గీతాంజలి చివరి చిత్రం తమన్నా కథానాయికగా రూపొందుతున్న దటీజ్‌ మహాలక్ష్మి. రాజకీయాల్లోకి వచ్చిన గీతాంజలి 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.