హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఏపీలో హల్‌చల్.. మలుపుమలుపుకో ట్విస్ట్‌

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్.. షార్ట్‌గా ఓఆర్ఆర్.. ఇప్పుడీ పదం ఏపీ రాజకీయాల్లో హల్‌చల్ చేస్తోంది. రింగు రోడ్డులో ఎన్ని మలుపులు ఉన్నాయో తెలీదు గానీ నేతల మాటలు మాత్రం చాలా మలుపులు తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు పోటీపడి మరీ మలుపుకో ట్విస్ట్ ఇస్తున్నారు. రింగు రోడ్డుపై యమస్పీడుతో జోరుగా సవారీ చేస్తున్నారు. ఆ.. క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు విమర్శనాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు.

విషయం ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందనుకుంటా..! నేరుగా విషయంలోకి వస్తే.. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తాజాగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి. ఓఆర్‌ఆర్‌కు చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడ్డారని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కష్టంతోనే రింగ్ రోడ్డు నిర్మితమైందని వైఎస్సార్సీపీ ఎంపీ చెప్పారు. పనిలో పనిగా 420 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ని కూడా తానే నిర్మించానని చంద్రబాబు చెబుతారంటూ ఘాటు విమర్శలు చేశారు.

Also Read:

విజయసాయి విమర్శలకు టీడీపీ ఎమ్మెల్సీ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు తలపెట్టిన హైదరాబాద్ రింగు రోడ్డుని వంకర రోడ్డుగా మార్చింది మీ మహామేత వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. రింగు రోడ్డుని అష్ట వంకర్లు తిప్పి అంచనాలు పెంచి భారీ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.

వైఎస్, ఆయన తనయుడు జగన్ అనుచరులతో కలిసి రూ.5,500 కోట్ల ప్రాజెక్టును రూ.35 వేల కోట్లకు పెంచి ఆస్తులు కూడబెట్టిన విషయాన్ని మరచిపోయారా విజయసాయి రెడ్డి గారు అని ఎద్దేవా చేశారు. తప్పుడు రికార్డులతో నష్ట పరిహారం కొట్టేసి మర్చిపోయామంటే కుదరదని.. పద్దు పాత పుస్తకాల్లో ఉంటుంది ఒక సారి దుమ్ము దులపండి అంటూ సెటైర్లు వేశారు.

Read Also:

రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారన్న వ్యాఖ్యాలపైనా వెంకన్న స్పందించారు. చంద్రబాబు హయాంలో చేసిన అప్పు రూ.లక్షా పది వేల కోట్లుగా చెప్పారు. అంటే ఏడాదికి 22 వేల కోట్లని.. ఐదు నెలల జగన్ పాలనలో 18 వేల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. అంతేకాకుండా 2019-2020 బడ్జెట్లో సంవత్సరానికి 48 వేల కోట్ల అప్పులు ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎవరు రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేస్తున్నారని ప్రశ్నించారు. మీ దొంగ మొహాలు చూసి బ్యాంకులు కూడా ఛీ కొడుతున్నాయంటూ ఘాటు విమర్శలు చేశారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.