వీహెచ్‌పీ ఫార్ములా అనుసరిస్తే రామమందిర నిర్మాణానికి ఐదేళ్లు పడుతుందా!

సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. వివాదాస్పద 2.77 స్థలం రామజన్మభూమి న్యాస్‌కు చెందుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో ఆలయన నిర్మాణం మొదలుకానుంది. అయితే, ఆలయ నిర్మాణానికి కనీసం అయిదేళ్లు పడుతుందని అంటున్నారు. విశ్వహిందూ పరిషత్ నమూనా ప్రకారం 250 మంది కళాకారులు నిర్విరామంగా పనిచేస్తే ఐదేళ్లలో పూర్తవుతుందని ఆలయ వర్క్‌షాప్ వద్ద ఉన్న ఓ నిపుణుడు తెలిపారు.

వర్క్‌షాప్ శిల్పకారుడు ఈ ఏడాది జులై చివరిలో చనిపోవడంతో ఇంకా వేర వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పగించలేదు. 1990 నుంచి రోజుకు ఎనిమిది గంటలు చొప్పున ఇక్కడ పనులు జరుగుతున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇవి సాగుతున్నా కింది అంతస్తు నిర్మాణంలో సగం మాత్రమే పూర్తయ్యాయి. వీహెచ్‌పీ నమూనా ప్రకారం కింది అంతస్తులో 212 స్తంభాల నిర్మాణం ప్రతిపాదించగా ప్రస్తుతం 106 మాత్రమే సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం వీహెచ్‌పీ వర్క్‌షాప్‌ వద్ద కార్మికులు ఎవరూ లేరని, ఒకవేళ పనులు ప్రారంభించి రోజుకు 250 మంది కళాకారులు నిర్విరామంగా పనిచేస్తే ఐదేళ్లలో పూర్తవుతుందని అన్నూభాయ్ సోంపుర తెలిపారు.

ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత నిర్మాణ సామాగ్రి తరలింపు మొదలుపెడతామని, పూర్తిచేసిన శిల్పాలను నిలబెట్టి పనులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. కింది అంతస్తుకు సంబంధించిన సగం స్తంభాలు సిద్ధంగా ఉన్నాయని, గోడలకు మార్బుల్ పలకాలను కూడా సిద్ధం చేసినట్టు వివరించారు. డిసెంబరులో ఆలయ నిర్మాణానికి పనులు ప్రారంభించే అవకాశం ఉందని తెలియజేశారు.

అవధ్ ప్రాంతానికి చెందిన వీహెచ్‌పీ అధ్యక్షుడు శరద్ శర్మ మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణంపై ఎలా ముందుకెళ్లాలనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. దీనిపై రామ్ జన్మభూమి న్యాస్ సభ్యులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ దృష్టంతా దేశంలో శాంతిపైనే ఉందని శర్మ వ్యాఖ్యానించారు. కాగా, 1984 లో ఈ ఆలయానికి నిర్మాణానికి వీహెచ్‌పీ భూమి పూజను నిర్వహించింది. భక్తుల నుంచి పావలా, ఒక రూపాయి ప్రాథమికంగా విరాళంగా సేకరించింది. నిర్మాణానికి మొత్తం రూ .8 కోట్లు విరాళాలు అందినట్టు వీహెచ్‌పీ ఆఫీస్ బేరర్లు తెలిపారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.