మాస్ మహారాజాతో పోటీపడనున్న వరలక్ష్మీ శరత్ కుమార్

తమిళ నటి, ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్‌కు డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్‌గా పేరుంది. ఆమె నటనే కాదు మాటలు కూడా చాలా పవర్‌ఫుల్‌గా, బోల్డ్‌గా ఉంటాయి. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, లేడీ విలన్‌గా పలు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించిన వరలక్ష్మి.. విజయ్ ‘సర్కార్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ఇది తమిళ డబ్బింగ్ సినిమా. సందీప్ కిషన్ హీరోగా వస్తోన్న ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ సినిమాతో వరలక్ష్మి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు రవితేజ సినిమాలో చేయడానికి అంగీకరించారు.

‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, క‌మ‌ర్షియ‌ల్ డైరెక్టర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొంద‌నుంది. లైట్ హౌస్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర‌వితేజ 66వ చిత్రమిది. ర‌వితేజ ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉండేలా ద‌ర్శకుడు గోపీచంద్ మ‌లినేని క‌థ‌ను ప్రిపేర్ చేస్తున్నారు.

Also Read:

ఈ సినిమాలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అలాగే త‌మిళ చిత్రాల్లో వైవిధ్య పాత్రల‌తో మెప్పిస్తున్న స‌ముద్రఖ‌ని కీల‌క పాత్రలో న‌టిస్తున్నారు. ఇప్పుడు మ‌రో కీల‌క పాత్రలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ న‌టిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. క‌థ, పాత్ర న‌చ్చడంతో ఆమె ఈ సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించారు. అయితే, ఆమె ఎలాంటి పాత్ర చేస్తున్నారన్న విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకవేళ ఇందులోనూ లేడీ విలన్ పాత్రే అయితే మాస్ మహారాజాతో వరలక్ష్మి పోటీపడి నటించడం ఖాయం. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈనెలలోనే సినిమా ప్రారంభం కానుంది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.