ఫలించిన తెలుగు బాక్సర్ జరీన్ పోరాటం.. మేరీకోమ్‌తో ఫైట్

టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కి ముందు ట్రయల్స్ నిర్వహించాలని పోరాడిన తెలంగాణ బాక్సర్ ఎట్టకేలకి విజయం సాధించింది. వచ్చే ఏడాది జనవరిలో క్వాలిఫయర్స్ జరగనుండగా.. ఎలాంటి ట్రయల్స్ లేకుండా 51 కేజీల విభాగంలో మేరీకోమ్‌ని పంపాలని భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) తొలుత భావించింది. అదే జరిగితే..? గత కొంతకాలంగా ఆ విభాగంలో పోటీపడుతున్న తనకి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన నిఖత్ జరీన్.. మేరీకోమ్‌తో ట్రయల్స్ నిర్వహించి ఎవరు గెలిస్తే వారిని క్వాలిఫయర్స్‌కి పంపాలని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజుకి లేఖ రాసింది. ఆమెకి అభినవ్ బింద్రాతో పాటు చాలా మంది క్రీడాకారుల మద్దతు కూడా లభించడంతో.. మేరీకోమ్, జరీన్ గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. దీంతో.. బీఎఫ్ఐ ఎట్టకేలకి వెనక్కి తగ్గి ట్రయల్స్ నిర్వహిస్తామని ప్రకటించింది.

సమస్య ఎక్కడ మొదలైందంటే..? సుదీర్ఘకాలంగా 48 కిలోల కేటగిరీలో పోటీపడుతున్న మేరీకోమ్.. ఆరు స్వర్ణాలు, ఒక రజత పతకం గెలుపొందింది. కానీ.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 48 కేజీల విభాగం లేకపోవడంతో.. ఆమె ఇటీవల 51 కిలోల కేటగిరీకి మారింది. దీంతో.. ఇన్నాళ్లు 51 కిలోల విభాగంలో పోటీపడుతున్న జరీన్‌ని పక్కన పెట్టిన భారత బాక్సింగ్ ఫెడరేషన్.. ఇటీవల ఆ కేటగిరీలో మేరీకోమ్‌ని డైరెక్ట్‌గా వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌కి పంపింది. అక్కడ సెమీస్‌లోనే వెనుదిరిగిన మేరీకోమ్.. కాంస్య పతకంతో సరిపెట్టింది. కానీ.. ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కి కూడా మేరీకోమ్‌ని ఎలాంటి ట్రయల్స్ నిర్వహించకుండానే పంపాలని మరోసారి ఫెడరేషన్ యోచించడంతో జరీన్ పోరాడింది.

ట్రయల్స్‌లో భాగంగా డిసెంబరు 29, 30 తేదీల్లో మేరీకోమ్, జరీన్ మధ్య ఫైట్ జరగనుంది. ఈ ఫైట్‌లో గెలిచిన వారు జనవరిలో టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో పోటీపడతారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.