‘నా మీద నాకే అసహ్యం వేస్తుంది’.. బూతు చిత్రాలపై జీవిత ఎటాక్

ఈ మధ్యకాలంలో సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం పోస్టర్, టీజర్స్‌లో అడల్ట్ కంటెంట్ ఎక్కువ పెడుతున్నారన్నారు . అశ్లీలత ఎక్కువ ఉండేలా పోస్టర్ విడుదల చేయడం ప్రమోషన్ ట్రిక్స్‌గా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు జీవిత.

ప్రముఖ నటుడు పింగ్ పాంగ్ సూర్య నిర్మిస్తున్న ‘కలియుగ’ మూవీ ప్రమోషనల్ సాంగ్ లాంచ్‌లో పాల్గొన్న జీవితా రాజశేఖర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘కలియుక ప్రమోషనల్ వీడియోను నేను లాంచ్ చేయడానికి కారణం పింగ్ పాంగ్ సూర్య. రాజమౌళి సై, రాజశేఖర్ ‘మా అన్నయ్య’ సినిమాలో తమ్ముడిగా నటించారు. సూర్య మా ఇంట్లోని మనిషి. ఈరోజుల్లో సినిమా తీయడం చాలా కష్టం. మా లాంటి వాళ్లకే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో సూర్య సినిమాపై ఉన్న ఇష్టంతో ఈ ‘కలియుగ’ అనే సినిమాని ప్రొడ్యూస్ చేశాడు.

సినిమా ఎవరు తీసినా కమర్షియల్‌ యాంగిల్‌లోనే తీస్తారు. డబ్బులు సంపాదించాలనే సినిమా తీస్తారు. కాని సూర్య ఆలోచన వేరు. అతను ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తూ.. ఇది కమర్షియల్‌గా ఉండేలా కామెడీ, లవ్, రొమాంటిక్ అని ఏదో రకంగా ప్రమోట్ చేసుకోవాలని అనుకోలేదు.

ఈ మధ్య కాలంలో లిప్ లాక్, అమ్మాయిల్ని భయంకరంగా ఎక్స్‌పోజ్ చేస్తూ పోస్టర్‌లు రిలీజ్ చేసి సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ అశ్లీలత సినిమాలో ఎంత ఉంటుంది అనేది పక్కనపెట్టేస్తే.. పోస్టర్స్, టీజర్‌లు మాత్రం అశ్లీలంగానే ఉంటున్నాయి. ఇదో పబ్లిసిటీ స్టంట్. చాలా సినిమాలకు ఇదే ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమా ఆ కోవకు చెందకుండా.. ఈరోజుల్లో అమ్మాయిల మీద జరుగుతున్న అన్యాయాలు, అత్యాచారాలు, స్త్రీకి ఎంత వరకూ భద్రత ఉంది ఇవన్నీ ప్రశ్నార్ధకాలే. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా, ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా వీటిలో ఎంత వరకూ మార్పు వచ్చింది. ఆడ పిల్లలకు మనం ఎంత వరకూ సెక్యురిటీ ఇవ్వగలుగుతున్నాం. మన ఇంట్లో మన ఆడబిడ్డ వరకూ ఎంత స్వేచ్చ ఇస్తున్నాం. ఇవన్నీ గమనించుకుంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామో తెలుస్తోంది.

వీటిని తలుచుకున్నప్పుడల్లా నామీద నాకే అసహ్యం వేస్తుంది. అంటే మనం ఎందుకు ఏమీ చేయలేకపోతున్నాం అని. అయితే సంతోషించాల్సిన విషయంలో ఏంటంటే ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగమే ‘కలియుగ’ సినిమా. ఈ సినిమా కాన్సెప్ట్ నాకు చెప్పడంతో నేను ప్రమోషన్‌లో పాల్గొన్నా’ అంటూ ఈ మూవీ ప్రమోషన్ సాంగ్‌ను విడుదల చేశారు జీవితా రాజశేఖర్.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.