ధోనీ చివరి మ్యాచ్ గత ఏడాదే ఆడేశాడు: భజ్జీ

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం అనుమానమేనని వెటరన్ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో ఆడిన ధోనీ.. ఆ తర్వాత భారత్ జట్టుకి దూరంగా ఉండిపోయాడు. దీంతో.. బీసీసీఐ ఈరోజు ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌లో కూడా ధోనీకి చోటు దక్కలేదు. అయితే.. ధోనీ గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లోనే చివరి మ్యాచ్ ఆడేశాడని భజ్జీ చెప్పుకొచ్చాడు.

‘ఐపీఎల్ 2020 సీజన్‌లో ధోనీ నిలకడగా రాణించే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో అతని సామర్థ్యంపై నాకెప్పుడూ సందేహాల్లేవు. అయితే.. ఐపీఎల్‌లో అతను మునుపటి ఫామ్‌ని అందుకున్నా.. టీమిండియాలోకి మాత్రం రీఎంట్రీ ఇచ్చేందుకు ఇష్టపడడు. ధోనీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నా.. అతను గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లోనే టీమిండియా తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. ఇక టీమ్‌లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చే ఆలోచన అతనికి లేదు’ అని హర్భజన్ సింగ్ వెల్లడించాడు.

మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీలో చాలా మ్యాచ్‌లు ఆడిన హర్భజన్ సింగ్.. ఐపీఎల్‌లోనూ గత రెండు సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో ఆడుతున్నాడు. దీంతో.. ధోనీ గురించి అతని చెప్పిన మాటలకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.