ట్యాంక్‌బండ్‌ వద్ద హైటెన్షన్.. ఫెన్సింగ్ దాటి దూసుకొచ్చిన కార్మికులు

ఆర్టీసీ కార్మికులు పిలుపునిచ్చిన చలో ట్యాంక్ బండ్ ఉద్రిక్తంగా మారింది. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు నిర్వహించనున్న సకల జనుల సామూహిక దీక్షల్లో పాల్గొనేందుకు జిల్లా కేంద్రాల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళా కార్మికులు కూడా భారీగా ట్యాంక్‌ బండ్‌ వద్దకు చేరుకున్నారు. ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్ వైపు రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

గతంలో మిలియన్ మార్చ్ సందర్భంగా జరిగిన ఘటనల నేపథ్యంలో చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి పోలీసులు అనుమతులు నిరాకరించారు. ట్యాంక్ బండ్ వైపు వచ్చే దారులన్నీ దాదాపుగా మూసివేశారు. జిల్లాల నుంచి వస్తున్న కార్మికులను ట్యాంక్ బండ్ వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారు. ట్యాంక్ బండ్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Also Read:

భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ పోలీసు వలయాన్ని ఛేదించి ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్ వైపు దూసుకొచ్చారు. పోలీసులు ఏర్పాటు చేసిన కంచె, బారీకేడ్లను దాటుకుని ట్యాంక్ బండ్‌ చేరుకున్నారు. ఒక్కసారిగా ఫెన్సింగ్‌ను పక్కను నెట్టేసి పరుగులు తీయడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ట్యాంక్ బండ్ వద్దనున్న వెంటకస్వామి విగ్రహం వద్ద ఉన్న పార్కు వద్దకు వందల సంఖ్యలో కార్మికులు చేరుకున్నారు.

సుమారు 300 మంది ఆర్టీసీ కార్మికులు ఎట్టకేలకు ట్యాంక్ బండ్‌పైకి చేరుకుని దీక్షల్లో కూర్చున్నారు. పోలీసు వలయాన్ని ఛేదించి కార్మికులు ట్యాంక్ బండ్‌కి చేరుకోవడంతో పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దఎత్తున పోలీసు బలగాలు ట్యాంక్ బండ్‌పైకి చేరుకుని కార్మికులను పోలీసు వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలిస్తున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో హైటెన్షన్ నెలకొంది.

ఇదిలా ఉంటే .. శుక్రవారం ఉదయం నుంచే రాజకీయ పార్టీల నేతలను పోలీసులు ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డిని హిమాయత్ నగర్ సర్కిల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్యాంక్ బండ్ వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించి, అటువైపు వెళ్లే అన్ని అన్ని దారులు మూసివేశారు. అయినప్పటికీ కార్మికులు పోలీసు కంచెలను దాటి ట్యాంక్ బండ్‌కి చేరుకున్నారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.