చలో ట్యాంక్ బండ్ హింసాత్మకం.. ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం!

ఆర్టీసీ కార్మికులు శనివారం చేపట్టిన చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం హింసాత్మకంగా మారి ఆందోళనకారులపై పోలీసులు దాడిచేసిన విషయం తెలిసిందే. పోలీసుల దాడిలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మహిళలపై కూడా పోలీసులు దాష్టికాన్ని ప్రదర్శించడంపై కార్మిక సంఘాలు, పలు పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ట్యాంక్‌బండ్‌ వద్ద శనివారం జరిగిన దమకాండను ఖండిస్తున్నామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. కార్మికులపై జరిగిన దాడిని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖండించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎంప్లాయీస్‌ యూనియన్ కార్యాయంలో అఖిలపక్షం నేతలతో ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీ నాయకులు ఆదివారం సమావేశమయ్యారు. ట్యాంక్‌బండ్‌ ఘటన, భవిష్యత్‌ కార్యాచరణ, విపక్షాల మద్దతు, సోమవారం హైకోర్టు విచారణ తదితర అంశాలపై చర్చించారు.

అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఛలో ట్యాంక్‌బండ్’ కార్యక్రమం విజయవంతం చేసిన అందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్ల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. నవంబరు 18న రాష్ట్ర వ్యాప్తంగా సడక్‌బంద్‌ నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. మంగళవారం నుంచి నలుగురు జేఏసీ నేతలు నిరవధిక నిరాహార దీక్షలో కూర్చుంటారని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై శనివారం నిర్వహించిన నిరసనలో మావోయిస్టులు ఎవరూ లేరని అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యానించారు.

హైకోర్టు సూచనల మేరకు ఆర్టీసీ సమ్మెపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. హైకోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలియకుండా సుప్రీంను ఆశ్రయిస్తామని సీఎం అనడం సమంజసం కాదని, ఇప్పటికైనా చర్చలకు పిలవాలని అశ్వత్థామరెడ్డి కోరారు. ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకొచ్చి చర్చలు జరిపేలా కృషి చేయాలని, నిన్న కేవలం ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాలు మాత్రమే ‘చలో ట్యాంక్‌బండ్’ కార్యక్రమంలో పాల్గొన్నాయని స్పష్టం చేశారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.