కేసీఆర్‌ని చూసి పాఠాలు నేర్చుకో.. సీఎం జగన్‌పై జనసేనాని ఘాటు వ్యాఖ్యలు

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను తప్పనిసరి చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు మీడియంలో బోధన నిలిపివేయడం తగదని, ఇప్పటి వరకు తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారిగా ఇంగ్లిష్ మీడియంకు మారాలంటే విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలన్న డిమాండ్లు వినపడుతున్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను కొనసాగించాలని విపక్షాలు ఆందోళనలకు దిగుతున్నాయి. తాజాగా ఇంగ్లిష్ మీడియం వ్యవహారంపై జనసనే అధ్యక్షుడు స్పందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను నిలిపివేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పవన్ తప్పుబట్టారు. తెలుగులో బోధన ఆపేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:

ప్రభుత్వ నిర్ణయం తనను లైబ్రరీకి వెళ్లేలా చేసిందని.. లైబ్రరీలో ఉన్న తెలుగు పుస్తకాలను గౌరవంగా చూసుకున్నట్లు చెప్పారు పవన్. వైఎస్సార్సీపీ నాయకత్వానికి తెలుగు భాషా సంపద ఎంత గొప్పదో అర్థం కావడం లేదని విమర్శించారు. విలువ తెలిసి ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం నిర్ణయం తీసుకుని ఉండేవారు కాదని ఆయన వ్యాఖ్యానించారు.

పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ని చూసి నేర్చుకోవాలని సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ యాసని.. సంస్కృతిని కాపాడుకోవడానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. 2017లో హైదరాబాద్‌లో నిర్వహించిన తెలుగు మహాసభలను ప్రస్తావించారు. భాష, సంస్కృతిని కాపాడుకోవడంలో వైఎస్సార్సీపీ నాయకత్వం కేసీఆర్‌ని చూసి పాఠాలు నేర్చుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read Also:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.