కృష్ణ, మహేష్ సినిమాల్లో మా అబ్బాయి నటించాడు: గల్లా జయదేవ్

ప్రముఖ వ్యాపారవేత్త, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్‌గా హీరోగా పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. తన కొడుకుని హీరోగా పరిచయం చేయడానికి సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ను కూడా స్థాపించారు జయదేవ్. అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ అనే సంస్థను స్థాపించి తొలి ప్రొడక్షన్‌గా తన కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. నిధి అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమాను ఆదివారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభించారు.

Also Read:

ఈ సందర్భంగా ఎంపీ జ‌య‌దేవ్ మాట్లాడుతూ.. ‘‘అమ‌ర రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థను చాలా రోజుల క్రిత‌మే రిజిష్టర్ చేశాం. కేవ‌లం సినిమాలే కాదు.. టెలివిజ‌న్ రంగంలోనూ కొత్త కంటెంట్‌ను అందించాల‌ని మేం భావిస్తున్నాం. అలాగే నా భార్య ప‌ద్మావ‌తి సూప‌ర్‌స్టార్ కృష్ణ కుమార్తె అన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న హీరోగానే కాదు.. డైరెక్టర్‌గా, నిర్మాత‌గా, స్టూడియో అధినేత‌గా త‌న మార్కును క్రియేట్ చేశారు. ఇప్పుడు మా ఫ్యామిలీ నుండి అశోక్ గ‌ల్లాను హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాం.

శ్రీరామ్ ఆదిత్యగారు డైరెక్ట్ చేసిన గ‌త రెండు చిత్రాలు చూశాను. చాలా బావున్నాయి. న‌చ్చాయి. ఇది కూడా త‌ప్పకుండా అంద‌రినీ మెప్పించేలా ఉంటుంది. అశోక్‌కి చిన్నప్పటి నుండే సినిమాలంటే ఇష్టం. మా మావ‌య్య కృష్ణగారి సినిమాల్లో చిన్నప్పుడు యాక్ట్ చేశాడు. కృష్ణగారే త‌న ఫ‌స్ట్ నిర్మాత‌, ద‌ర్శకుడు. అలాగే ‘నాని’ సినిమాలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌తో యాక్ట్ చేశాడు.

అశోక్ 7వ త‌ర‌గ‌తి నుండి ఇంట‌ర్ వ‌ర‌కు సింగ‌పూర్‌లో చ‌దివాడు. ఆ స‌మ‌యంలో త‌ను డ్రామా అనే స‌బ్జెక్ట్‌ను ఎంచుకుని నేర్చుకున్నాడు. డిగ్రీని కూడా టెక్సాస్ ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్‌లోనే చేశాడు. త‌ర్వాత రెండు, మూడు ఏళ్లు హార్డ్ వ‌ర్క్ చేసి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు’’ అని చెప్పారు.

నిర్మాత ప‌ద్మావ‌తి గ‌ల్లా మాట్లాడుతూ.. ‘‘అమ‌ర రాజా గ్రూప్ చాలా పెద్ద సంస్థ. మేం మొద‌లు పెట్టిన అన్ని సంస్థలు గొప్పగా స‌క్సెస్ అయ్యాయి. ఇప్పుడు అమ‌ర రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థను మొద‌లు పెట్టాం. ఈ వెంచ‌ర్ కూడా మిగ‌తా వాటిలా స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాం. అశోక్ చిన్నప్పటి నుండి హీరో కావాల‌ని ఎంతో క‌ష్టప‌డ్డాడు. త‌ను పెద్ద యాక్టర్ కావాల‌ని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.