కూలిన హెలికాప్టర్.. ఎనిమిది మంది మృతి, సైన్యాధిపతి మిస్సింగ్

హెలికాప్టర్‌ కూలిన ప్రమాదంలో తైవాన్‌ ఆర్మీ చీఫ్ సహా మరో ఉన్నతాధికారులు ఇద్దరు గల్లంతయ్యారు. రాజధాని తైపీ సమీపంలోని ఒక పర్వతంపై ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు తైవాన్ రక్షణ శాఖ ప్రకటించింది. గల్లంతయిన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. స్థానిక కాలమానం ప్రకారం జనవరి 1న ఉదయం ఈశాన్య యిలాన్‌ కౌంటీలోని సైనికులను కలవడానికి మిలటరీ ఛీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ షెన్‌-ఇ-మింగ్‌ హెలికాప్టర్‌లో బయలుదేరారు. ఆయనతో సహా 13 మంది ప్రయాణిస్తున్న యూహెచ్‌ 60ఎం హెలికాప్టర్‌ రాజధాని తైపీ సమీపంలోని పర్వతాల వద్ద కూలిపోయింది.

ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఘటనలో ఎనిమిది ప్రాణాలు కోల్పోగా, సైన్యాధిపతి షెన్‌, మరో ఇద్దరు అచూకీ దొరకలేదు. గల్లంతైనవారి గురించి గాలింపు కొనసాగుతోందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కంట్రోల్ రూమ్‌తో సంబంధాలు తెగిపోయిన తర్వాత హెలికాఫ్టర్ అత్యవసరంగా తైపీ నగర సమీపంలో దిగినట్టు అధికారులు వెల్లడించారు. అయితే, ఎయిర్‌ఫోర్స్ జనరల్ షెన్-యి-మింగ్ సహా ఎనిమిది చనిపోయినట్టు తైవాన్ అధికారిక మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది.

జనవరి 11న తైవాన్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హెలికాఫ్టర్ ప్రమాదంతో తైవాన్ అధ్యక్షుడు సయ్ ఇంగ్ వెన్ తన ఎన్నికల ప్రచారాన్ని రద్దుచేసుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేసి సైన్యాధిపతి ఆచూకీని గుర్తించాలని ఆయన కోరారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.