ఐఏఎస్, ఐపీఎస్‌లకు మాజీ మంత్రి వార్నింగ్.!

జగన్ సర్కార్ జీవోలపై సంతకాలు చేస్తే ఇబ్బందులు తప్పవని మాజీ మంత్రి అధికారులను హెచ్చరించారు. మూడు రాజధానుల ప్రతిపాదనలపై విమర్శలు గుప్పించిన ఉమ.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఘాటు హెచ్చరికలు చేశారు. సీఎం జగన్ రహస్య జీవోలపై తొందరపడి సంతకాలు పెట్టొద్దని ఆయన సూచించారు. అన్ని నిర్ణయాలపై సీబీఐ విచారణ ఉంటుందని.. తొందరపడి తెలివితక్కువ నిర్ణయాలు తీసుకోవద్దంటూ హెచ్చరించారు.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జగన్.. విజయసాయి రెడ్డి మాటలు విని సంతకాలు పెట్టిన అధికారులు చంచల్‌గూడ జైలుకి వెళ్లారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని దేవినేని ఉమ అన్నారు. గోల్డ్‌మెడల్ పొందిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి నేటికీ పోస్టింగ్ కోసం ఢిల్లీలో తిరుగుతున్నారన్నారు. పార్లమెంట్.. ప్రధాన మంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని.. నేటికీ పోస్టింగ్ ఇవ్వలేదని ఆయన చెప్పుకొచ్చారు.

Also Read:

జీఎన్ రావు కమిటీ నివేదికపై ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్డీవోగా ఉన్న సమయంలో జీఎన్ రావు రెండు సార్లు సస్పెండ్ అయిన జీఎన్ రావు నివేదిక ఇస్తున్నారంటూ ఆక్షేపించారు. పిచ్చివాడు నిర్ణయాలు తీసుకుంటే పాటించాలి కదా అని పోలీసు అధికారులు సైతం వాపోతున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ నుంచి వస్తే.. ఇక్కడి నుంచి వెళ్లమంటున్నారని అధికారులు ఆవేదన చెందుతున్నారని ఉమ చెప్పుకొచ్చారు.

రాజధాని విశాఖపట్నంలో ఉంటుంది.. భీమిలిలో ఏర్పాటు చేస్తామని ఏ2 విజయసాయి రెడ్డి ప్రకటనలు చేయడం మన దౌర్భాగ్యమని ఉమ ఘాటు విమర్శలు చేశారు. మంత్రులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయి ప్రకటన చేస్తుంటే ఈ సన్నాసులు ఏం చేస్తున్నారని ఆయన ఘాటు విమర్శలు చేశారు. రాజధానిపై మంత్రులు లేదా డిప్యూటీ సీఎంలు.. లేకుంటే ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని.. కానీ ఒక రాజ్యసభ్య సభ్యుడు ప్రకటన చేయడమేంటని ఆయన ప్రశ్నించారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.