ఈ ఏడాది కష్టాల సంక్రాంతి.. పండుగ రోజున రైతులతోనే చంద్రబాబు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. పర్వదినాన మందడంలో రైతులు చేపట్టిన దీక్షకు టీడీపీ అధినేత సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నేను సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడం లేదన్నారు. ఏపీకి ఇది కష్టాల సంక్రాంతి అన్నారు. మిగతా రోజుల్లో ఎక్కడున్నా ఫర్వాలేదు గానీ… సంక్రాంతి పండుగ మూడు రోజులు నారావారి పల్లెలోనే ఉందామని భువనేశ్వరి చెప్పేదన్న బాబు.. ఈసారి మాత్రం తాము సంక్రాంతి పండుగ చేసుకోవడం లేదన్నారు.

రాజధాని విషయంలో సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని చంద్రబాబు విమర్శించారు. అందర్నీ బాధపెట్టి తాను ఆనందించాలని జగన్ చూస్తున్నారన్నారు. తండ్రి చనిపోతే ఓదార్పు యాత్ర చేసిన జగన్.. రాజధాని మృతుల కుటుంబాలకు ఎందుకు ఓదార్చడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు.

శివరామకృష్ణన్‌ కమిటీ కూడా విజయవాడ-గుంటూరు ప్రాంతమే రాజధానికి అనుకూలం అని చెప్పిందని.. విజయవాడకే తొలి ప్రాధాన్యం ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. రాజధాని కోసం ఎవరూ ప్రాణత్యాగాలు చేయొద్దని పోరాడి సాధిద్దామని రైతులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఓవైపు రైతులు ఆందోళనలు చేస్తుంటే.. సీఎం ఎడ్ల పందేలు, కోడి పందేలను చూడటానికి వెళ్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించే తీరిక చంద్రబాబుకు లేదా? అని ఆయన సీఎంను నిలదీశారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.