ఇది పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథ: ‘విజయ్ సేతుపతి’ డైరెక్టర్

కొంత మంది దర్శకులు ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని కథ రాసుకుంటారు. కానీ, అనుకోని పరిస్థితుల్లో అదే కథను వేరొక హీరోతో చేయాల్సి వస్తుంది. తన పరిస్థితి కూడా అంతే అంటున్నారు ‘విజయ్ సేతుపతి’ దర్శకుడు విజయ్ చందర్. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘సంగతమిళన్’. రాశీఖన్నా హీరోయిన్. నివేద పేతురాజ్ మరో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను తెలుగులో ‘విజయ్ సేతుపతి’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఈనెల 15న రెండు భాషల్లో ఒకేసారి విడుదలవుతోంది.

Also Read:

కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు విజయ్ చందర్, ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత రావూరి వి.శ్రీనివాస్, ఇతర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విజయ్ చందర్‌తో ‘సమయం’ కాసేపు ముచ్చటించింది. సినిమా గురించి అడిగి తెలుసుకుంది. ఈ సంభాషణలో విజయ్ చందర్ ఆశ్చర్యకర విషయాలు చెప్పుకొచ్చారు. అసలు ఈ సినిమా కథ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నానని చెప్పారు. కానీ, ఆయన రాజకీయాలతో బిజీ అయిపోవడంతో విజయ్ సేతుపతితో చేశానని అన్నారు.

Also Read:

తెలుగులో పవన్ కళ్యాణ్ మాదిరిగానే తమిళంలో విజయ్ సేతుపతికి మంచి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, అందుకే కథను ఆయన వద్దకు తీసుకెళ్లానని అన్నారు. కథ నచ్చడంతో విజయ్ సేతుపతి వెంటనే ఓకే చెప్పారని తెలిపారు. టీజర్ చూసి ఇది పక్కా కమర్షియల్ మూవీ అనుకుంటున్నారని, కానీ దీనిలో సోషల్ మెసేజ్ కూడా ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ ఉద్దానం కిడ్నీ సమస్య గురించి పోరాడినట్టే ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక ప్రజా సమస్య గురించి పోరాడతారని చెప్పారు. అంతేకాకుండా, ఈ సినిమాలో విజయ్ సేతుపతి ద్విపాత్రాభినయం చేశారని వెల్లడించారు.

Also Read:

కాగా, విజయ్ చందర్ ఇప్పటి వరకు రెండు తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. విక్రమ్‌తో చేసిన ‘స్కెచ్’ సినిమా విజయ్ చందర్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. అయితే, తనకు తెలుగులో సినిమాలు చేయాలనే కోరిక ఉందని విజయ్ చందర్ చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ వంటి మాస్ హీరోలతో సినిమాలు చేయడమంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన కోసం కథ సిద్ధం చేస్తానని వెల్లడించారు. తమిళ్ కన్నా తెలుగులో కమర్షియల్ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని, అందుకే ఇక్కడ సినిమాలు చేయాలనుకుంటున్నానని తన మనసులో మాటను బయటపెట్టారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.