ఇంగ్లిష్ మీడియంపై కాస్త వెనక్కు తగ్గిన జగన్.. కీలక మార్పులు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1- 8వ తరగతి వరకూ ఆంగ్లమాధ్యమంలో బోధన అమల్లోకి తీసుకురానున్నట్టు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జగన్ ప్రభుత్వం ఈ విధానంలో స్పల్ప మార్పు చేసింది. కేవలం ఆరో తరగతి వరకూ మాత్రమే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ఈ అంశంపై ఉన్నతాధికారులతో అధికారులతో శనివారం సమీక్షించిన సీఎం.. అనంతరం నిర్ణయం తీసుకున్నారు. అధికారికంగా ఓ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఇంగ్లీష్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని, ‘నాడు-నేడు’లో భాగంగా వీటిని అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి సూచించారు. బోధనకు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విధానాలను అనుసరించాలని ఆయన సూచించారు.

తొలుత 1 నుంచి 8వ తరగతి వరకు మాత్రమే మాధ్యమంలో బోధించాలని నిర్ణయించినా, సమీక్ష అనంతరం మార్పులు చేసి 1 నుంచి 6వ తరగతి వరకు పరిమితం చేశారు. ఆ తర్వాత 7, 8, 9, 10 తరగతులకు వరుసగా దీనిని అనుసరిస్తారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విధానాల్లో 10వ తరగతికి దేశ వ్యాప్తంగా కామన్‌ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థులతో పోటీ పడాలంటే ఇప్పుడు 8వ తరగతి తొలిసారి ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థికి కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది.

2020-21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8 వరకు అన్ని ప్రభుత్వ, ఎంపీపీ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు.. అన్ని తరగతులను ఇంగ్లీష్ మీడియంగా మార్చడానికి పాఠశాల విద్యా కమిషనర్ ఒక ప్రతిపాదనను సమర్పించారు. ఈ విషయాన్ని పరిశీలించిన తరువాత 1 వ తరగతి నుంచి 6 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంగా మార్చడానికి పాఠశాల విద్యా కమిషనర్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఉపాధ్యాయులు ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి ప్రస్తుత విద్యా సంవత్సరం, 2020 వేసవిలో వారికి ఇంటెన్సివ్, విస్తృతమైన శిక్షణ ఇవ్వనున్నారు. నిర్దిష్ట అంశాలు, సాధారణంగా వారి ఇంగ్లీష్ మీడియం బోధనా నైపుణ్యాలను మెరుగుపరిచే వరకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. ఇక, ప్రభుత్వం నిర్ణయం విజయవంతం కావాలంటే భవిష్యత్తులో ఉపాధ్యాయ నియామకాలు, ఇంగ్లీష్ మీడియం బోధనలో ఉత్తమ ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులను నియమించాలి.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.