ఇంకేం కావాలి.. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై పిటిషన్‌ కొట్టివేత

ర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం (డిసెంబర్ 2) కొట్టివేసింది. కార్మికుల సమ్మె వ్యవహారం సుఖాంతమైందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇంకేం కావాలని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలను నిలువరించేలా చర్యలు చేపట్టడంతో పాటు ఉద్యోగులను విధుల్లోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ టీజేఎస్ (తెలంగాణ జన సమితి) ఉపాధ్యక్షుడు పీఎల్‌ విశ్వేశ్వర రావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

పిటిషన్‌లో కోరిన అభ్యర్థన ఇప్పటికే నెరవేరిందని.. ఇంకేం కావాలని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. కార్మికులందరినీ విధుల్లోకి తీసుకున్నారని, కార్మిక న్యాయస్థానానికి వెళ్లకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేసింది. ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబరు నెల వేతనాలు ఇస్తామని ప్రకటించిందని, తక్షణ సాయం కింద ఆర్టీసీకి రూ.100 కోట్లు విడుదల చేస్తామని చెప్పిందని కోర్టు తెలిపింది.

Also Read:

పిటిషనర్‌ తన వాదనలు వినిపిస్తూ.. చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించినప్పుడు ప్రభుత్వం మొండిగా వ్యవహరించిందని.. ఇప్పుడు పూర్తి భిన్నంగా నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కార్మికులను మాత్రమే చర్చలకు పిలిచి, కార్మిక సంఘాలను ఆహ్వానించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కార్మిక సంఘాలు చట్టబద్ధంగా గుర్తింపు పొందాయని.. వాటిని పిలవకపోవడం చట్టవిరుద్ధమని వాదించారు.

పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. కార్మిక సంఘాలకు ఏవైనా సమస్యలు, అభ్యంతరాలు ఉంటే సంబంధిత అథారిటీని ఆశ్రయించవచ్చని సూచించింది. చట్టబద్ధమైన హక్కుల కోసం కార్మిక సంఘాలు సొంతంగా పోరాడగలవని.. వాటి కోసం సాధారణ ప్రజలు హైకోర్టును ఆశ్రయించి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు మొట్టికాయలు వేసింది.

Don’t Miss:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.