‘ఆకాశం నీ హద్దురా!’ అంటున్న సూర్య.. ఇదుగో ఫస్ట్‌లుక్

తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉంది. అందుకే, తమిళంలో ఆయన హీరోగా తెరకెక్కే ప్రతి సినిమాను తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తుంటారు. ఈ ఏడాది రెండు సినిమాలతో సూర్య ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒకటి ‘ఎన్జీకే’, మరొకటి ‘బందోబస్త్’. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి. అందుకే ఇప్పుడు మరో కొత్త సినిమాతో సూర్య తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Also Read:

తెలుగులో విక్టరీ వెంకటేష్‌తో ‘గురు’ లాంటి మంచి సినిమాను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నారు. తమిళంలో ‘సూరరై పోట్రు’ టైటి‌ల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ అనే టైటిల్‌తో విడుదల చేస్తు్న్నారు. అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. తెలుగు, తమిళ ఫస్ట్‌లుక్ పోస్టర్లను హీరో సూర్య ట్వీట్ చేశారు. ‘‘అసాధారణమైన కలతో ఒక సాధారణ వ్యక్తి’’ అని సూర్య ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, ఈ సినిమాకు సూర్యనే నిర్మాత. సిఖ్యా ఎంటర్‌టైన్మెంట్ సౌజన్యంతో 2డి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజశేఖర్ కర్పూరపాండియన్, గునీత్ మోంగా, ఆలిఫ్ సూర్తి సహనిర్మాతలు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. కాళీ వెంకట్, కరుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న, కృష్ణ కుమార్ తదితరులు నటిస్టున్నారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.