అయోధ్య తుది తీర్పు.. అనూహ్యంగా సెలవు రోజే ఎందుకు?

అయోధ్య భూ వివాదం కేసులో సర్వోన్నత న్యాయస్థానం చారిత్రత్మక తీర్పును శనివారం వెలువరించింది. శతాబ్దానికిపైగా కొనసాగుతోన్న వివాదానికి సుప్రీం తీర్పుతో తెరపడింది. అయితే, సాధారణంగా సోమవారం నుంచి శుక్రవారం మధ్యలో తీర్పులను వెలువరిస్తుంది. వీటికి భిన్నంగా సెలవు రోజైన శనివారం నాడు తీర్పు వెలువరించి అందర్నీ అశ్చర్యంలో ముంచెత్తింది. వాస్తవానికి ఈ కేసులో విచారణ అక్టోబరు 16 నాటికి పూర్తిచేసిన ధర్మాసనం.. తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. చీఫ్ నవంబరు 17న పదవీవిరమణ చేయనుండగా ఆలోగా తీర్పు వెలువడుతుందని భావించారు.

ముఖ్యమైన కేసుల్లో మాత్రం సెలవు రోజుతో సంబంధం లేకుండా న్యాయస్థానం తీర్పులు వెలువరించవచ్చు. కానీ, పదవీ విరమణ చేసే ముందు రోజు మాత్రం న్యాయమూర్తి తీర్పులు వెల్లడించరు. ఇక, జస్టిస్ గొగొయ్ పదవీవిరమణ చేసేది ఆదివారం కాగా, ఆ ముందు రోజు శనివారం కూడా సెలవు కావడంతో ఆయనకు నవంబరు 15 చివరి పనిదినం. దీంతో నవంబరు 14న లేదా 15న తీర్పు వెలువరిస్తారని న్యాయ వర్గాల్లో ముమ్మరంగా ప్రచారం జరిగింది.

ఒకవేళ కోర్టు తీర్పును వెలువరించిన తర్వాత రోజు ప్రతివాదులు దీనిని సమీక్షించమని కోరే అవకాశం ఉంది. దీనికి ఒకటి లేదా రెండు రోజుల సమయం పడుతుంది. దీనిని కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి నవంబరు 14 లేదా 15లోపు అయోధ్య వివాదంపై తీర్పు వెలువడుతుందని శుక్రవారం సాయంత్రం వరకూ అటు ప్రభుత్వం కానీ, ఇటు సుప్రీంకోర్టు కానీ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. కానీ, శనివారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనున్నట్టు సుప్రీం తన వెబ్‌సైట్‌లో శుక్రవారం రాత్రి అనూహ్యంగా ప్రకటించి షాక్ ఇచ్చింది.

సామాజిక వ్యతిరేకతను అరికట్టే వ్యూహంలో భాగంగానే ఆకస్మిక ప్రకటన చేసి, సున్నితమైన, భావోద్వేగ, విశ్వాసాలను రెచ్చగొట్టే కుట్రలకు అవకాశం ఇవ్వకుండా చేయడమే దీని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఏదిఏమైనా ఉత్తర ప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా ముఖ్యంగా అయోధ్యలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోరాదనే ఇలా వ్యవహరించిందనే వాదనలు వినబడుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు భద్రత ఏర్పాట్లను సమీక్షించాయి. శుక్రవారం ఉదయం ఉన్నఫలంగా యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఢిల్లీకి పిలిపించిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్.. భద్రత అంశాలపై వారితో చర్చించారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.